షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు

 జగన్ 

సొంత వర్గానికే 

పెద్దపీట, మంత్రులెవరైనా 

షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు సంచలనం



అమరావతి: 

ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై అధికార పార్టీలోని కొందరు నిరసనలు తెలుపుతుంటే.. ప్రతిపక్ష టీడీపీ సామాజిక న్యాయం పాటించలేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సామాజిక న్యాయం అంటే తెలియదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.


జగన్ శ్రద్ధ సొంతవర్గంపైనే..


వైఎస్ జగన్ తన సొంత వర్గానికి న్యాయం చేసుకోవడంపై చూపిన శ్రద్ధ.. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిపై ఏనాడూ చూపింది దేదని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడమేనా? మీరు చేసిన సామాజిక న్యాయం.? అని ప్రశ్నించారు. వేలాది మంది బడుగు, బలహీన వర్గాల మీద కేసులు పెట్టి, బెదిరింపులు, వేదింపులు, హత్యలు, అవమానాలకు గురి చేయడమేనా మీరు సాధించిన సామాజిక న్యాయం.? అని నిలదీశారు. చిత్తూరు జిల్లాలో దళిత మంత్రి నారాయణస్వామికి కుర్చీ కూడా ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అవమానించి.. ఆయనను కన్నీటి పర్యంతం చేయడం సామాజిక న్యాయమా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. దళిత, మహిళా హోం మంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డిని షాడో మినిస్టర్‌గా నియమించి హోం మంత్రిని డమ్మీని చేయడం సామాజిక న్యాయమా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్తరాంధ్రకు సామంతరాజుగా మీ అవినీతి భాగస్వామి, ఏ2 విజయసాయిరెడ్డి నియమించి.. అక్కడి మంత్రులు, ఎమ్మల్యేలను డమ్మీలను చేయడం సామాజిక న్యాయమా.? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.